ఎంఎంటీఎస్ రెండు బోగీలు పూర్తిగా ధ్వంసం
బర్కత్‌పుర, హైదరాబాద్: కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఎంఎంటీఎస్, హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఢీకొన్న ఘటనలో దక్షిణ మధ్య రైల్వేకు రూ. 8 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. సోమవారం ఉదయం కాచిగూడ స్టేషన్‌లో సిగ్నల్ లెవెల్ క్రాసింగ్ వద్ద ఎంఎంటీఎస్, హంద్రీ ఇంటర్‌సిటి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో 17 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఘటనలో హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజన్ స్వల్పంగా దెబ్బతినగా, ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఎంఎంటీఎస్ రైలు మొత్తం ఏడు బోగీలు ప్రమాదానికి గురయ్యాయి. వాటిలో రెండు బోగీలు పూర్తిగా, మరో 5 బోగీలు మామూలుగా ధ్వంసమయ్యాయి. ధ్వంసమైన ఎంఎంటీఎస్ రెండు బోగీలను మౌలాలి రైల్వే షెడ్‌కు, మూడు బోగీలను ఫలక్‌నామకు తరలించారు. రెండు బోగీలను కాచిగూడ స్టేషన్‌లో ఉంచారు. హంద్రీ ఇంటర్‌సిటీ బోగీలను చిన్న, చిన్న మరమ్మతులు చేసి వాటిని ఫలక్‌నుమకు తరలించారు.
ఎంఎంటీఎస్ ఒక్కో బోగీకి మూడున్నర కోట్లు
ఎంఎంటీఎస్ రైలు ఒక్కో బోగీకి మూడున్నర కోట్ల వరకు ఖర్చవుతుందని రైల్వే అధికారులు తెలిపారు. తమిళనాడు పెరంబూదురులోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఈ బోగీలను తయారు చేస్తోంది. ఆధునిక టెక్నాలజీతో దృఢమైన స్టీల్‌తో బోగీలను తయారు చేస్తున్నారు. అందు వల్లనే ఎంఎంటీఎస్ రైలు ఇంజన్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన లోకో పైలట్ చంద్రశేఖర్‌ను బయటకు తీసుకురావడానికి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఎనిమిది గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది. గతంలో ఎంఎంటీఎస్‌కు 9 బోగీలు మాత్రమే ఉండేవి. గత జూన్ నుంచి 12 బోగీలను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.