‘తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్‌’ మూవీ రివ్యూ

బ్యాన‌ర్‌: ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్‌

న‌టీన‌టులు: స‌ందీప్ కిష‌న్‌, హ‌న్సిక‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, బ్ర‌హ్మానందం, వెన్నెల‌కిషోర్‌, ప్ర‌భాస్ శ్రీను, పృథ్వీ, ర‌ఘుబాబు, స‌ప్త‌గిరి, అన్న‌పూర్ణ‌మ్మ‌, వై.విజ‌య‌, కిన్నెర‌, స‌త్య‌కృష్ణ త‌దిత‌రులు

సంగీతం: సాయికార్తీక్‌

కెమెరా: సాయిశ్రీరామ్‌

క‌థ‌: రాజ‌సింహ‌

ఎడిటింగ్‌: ఛోటా కె.ప్ర‌సాద్‌

నిర్మాత‌లు: అగ్ర‌హారం నాగిరెడ్డి, కె.సంజీవ రెడ్డి, శ్రీనివాస్ ఇందుమూరి, రూపా జ‌గ‌దీష్‌

ద‌ర్శ‌క‌త్వం: జి.నాగేశ్వ‌ర‌రెడ్డి

 

 

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ సినిమాల్లో న‌టిస్తున్న యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ రీసెంట్‌గా ` నిను వీడ‌ని నీడ‌ను నేనే`తో స‌క్సెస్ అందుకున్నాడు. సస్పెన్స్ హార‌ర్‌ థ్రిల్ల‌ర్ తర్వాత సందీప్ న‌టించిన మ‌రో చిత్రం `తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్‌`. కామెడీ సినిమాల‌ను తెర‌కెక్కించ‌డంలో జి.నాగేశ్వ‌ర‌రెడ్డి స్పెష‌లిస్ట్ అన‌డంలో సందేహం లేదు. ఈ చిత్రాన్ని కూడా ఆయ‌న త‌న‌దైన స్టైల్లోనే తెర‌కెక్కించాడు. ఆ విష‌యం ట్రైల‌ర్‌లో అవ‌గ‌తమ‌వుతుంది. అస‌లు కేసులు లేని ఓ లాయ‌ర్ తెనాలి రామ‌కృష్ణ క‌థేంటో తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం..

 

కథ:

కర్నూలు సెంటర్‌లో వర్షం పడుతున్న వేళ తెల్లవారు జామున 4 గంటలకు కొండారెడ్డి బురుజు ద‌గ్గ‌ర ఓ హ‌త్య జ‌రుగుతుంది. అయితే.. ప్రజల మంచి కోరే వ్యాపారవేత్తగా జిల్లాలోనే మంచి పేరున్న వరలక్ష్మీ దేవి(వరలక్ష్మీ శరత్ కుమార్)ని ఆ కేసులో ఇరికిస్తారు. చిన్నచిన్న పెండింగ్ కేసులను కాంప్రమైజ్ చేస్తూ ఒక పెద్ద కేసు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న యువ లాయర్ తెనాలి రామకృష్ణ(సందీప్ కిషన్)కు వరలక్ష్మి కేసు వాదించే అవకాశం వస్తుంది. తన తెలివితేటలతో తెనాలి రామకృష్ణ ఆ కేసు గెలుస్తాడు. వరలక్ష్మిని కేసు నుంచి బయటకు తీసుకొచ్చాక ఆ కేసులో కొత్త కోణం బయటకు వస్తుంది. ఆ కోణం కథను ఎలా మలుపు తిప్పింది? ఆ హత్య ఎవ‌రు చేయించారు.? లేడీ రామ్‌జెఠ్మలానీ అని పేరు తెచ్చుకోవాలనే ఆశయంతో ఉన్న లాయ‌ర్ రుక్మిణి(హ‌న్సిక‌)తో తెనాలి రామకృష్ణ ప్రేమాయ‌ణం ఎలా న‌డిచింది? అనేది వెండితెర‌పై చూడాల్సిందే..

 

 

విశ్లేషణ:

తెనాలి రామకృష్ణ అనే పేరు వినగానే హాస్యకవి, వికటకవిగా పేరొంది తెనాలి రామకృష్ణుడు గుర్తొస్తారు. అలాంటి గొప్ప కవి పేరుతో తీసిన సినిమాలో కామెడీయే ఎక్కువగా ఉంటుందని ఎవరైనా అనుకుంటారు. విడుదలకు ముందు కూడా ఈ సినిమా కామెడీ సినిమా అని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఆ రేంజ్‌లో కామెడీ లేదు కానీ, నవ్వులు పండించే ప్రతయ్నం అయితే చేశారు. ఫస్ట్ ఆఫ్‌లో సందీప్ కిషన్ పాత్రకు తగ్గట్టుగా ఎలివేషన్ సీన్స్‌తో పాటు హీరోయిన్‌తో నడిచే కెమిస్ట్రీ బాగానే సాగింది. స్క్రీన్ ప్లే, టైమింగ్ కామెడీ ఆకట్టుకుంటుంది. అదేవిధంగా.. సందీప్ కిష‌న్ త‌న న‌ట‌న‌తో బాగా ఆక‌ట్టుకుంటాడు. కోర్టు బ‌య‌ట ఇరువ‌ర్గాల మ‌ధ్య రాజీ కుదిర్చే సీన్లు బాగా వ‌చ్చాయి. ఇంటర్వెల్‌కి ముందు చిన్న ట్విస్ట్‌తో రెండో భాగం మొదలవుతుంది.

 

 

ఈ సినిమాలో సందీప్ కిష‌న్, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ న‌ట‌న హైలెట్‌గా నిలుస్తుంది. త‌మ పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేశారు. ఇక లాయ‌ర్ రుక్మిణి పాత్ర‌లో హ‌న్సిక ఆక‌ట్టుకుంది. సప్తగిరి, ప్రభాస్ శ్రీనుల కామెడీ మామూలుగానే అనిపిస్తుంది. పోసాని కృష్ణమురళి కామెడీ సీన్స్ ఫరవాలేదనిపించేలా ఉంటాయి. అదేవిధంగా సాయి కార్తీక్ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మొత్తంగా చెప్పాలంటే.. ప్రేక్షకుడు ఊహించినంత కామెడీ కానీ, ట్విస్టులు కానీ ఇందులో ఉండవు. కామెడీ పండించడం కన్నా సెటైర్లు వేయడానికే కొన్ని సన్నివేశాలు ఉన్నట్లు అనిపిస్తుంది. చమ్మక్ చంద్రతో ఆడ వేషం వేయించి తీసిన సీన్లు ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి సినిమాపై మరింత దృష్టిపెట్టి ఉంటే కామెడీ పరంగా అయినా మంచి పేరు వచ్చుండేది. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో ఆయన మార్కు తగ్గిందని చెప్పాలి. మంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సందీప్ కిషన్‌కు తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ కూడా నిరాశనే మిగిల్చిందని చెప్పాలి.

ప్ల‌స్‌లు..

సందీప్‌కిష‌న్ న‌ట‌న‌

హీరో – హీరోయిన్ల కెమిస్ట్రీ

నేప‌థ్య సంగీతం

కెమెరా పనితనం