గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన ఫడ్నవిస్


ముంబై: మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారికి అందజేశారు. ఫడ్నవిస్ సారధ్యంలోని గత ఐదేళ్ల ప్రభుత్వ పదవీకాలం ఇవాల్టితో పూర్తి కావడంతో పదవికి ఆయన రాజీనామా చేశారు. మధ్యాహ్నం 4.15 గంటల ప్రాంతంలో ఫడ్నవిస్ నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌ను కలుసుకున్నారు. రాజీనామా పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో ఫడ్నవిస్ మాట్లాడుతూ, తన రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్టు చెప్పారు.

 

గత ఐదేళ్ల పాలనలో తనకు సహకరించిన మహారాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రాభివృద్ధికి తమ ప్రభుత్వం పనిచేసిందని, రైతులకు అండగా నిలిచిందని తెలిపారు. బీజేపీ-శివసేన కూటమిని ప్రజలు మరోసారి ఎన్నుకున్నారని, ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశాలు ఇంకా తెరిచే ఉన్నాయని చెప్పారు.