జైలులో ఉన్న శశికళకు మరో షాక్ !



చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నేత శశికళకు మరో షాక్ తగిలింది. తాజాగా.. ఆమెకు చెందిన 1,600 కోట్ల రూపాయల ఆస్తులను బినామీ ఆస్తుల నిషేధ చట్టం కింద ఐటీ అధికారులు జప్తు చేశారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పెద్ద నోట్ల సొమ్ముతో శశికళ కుటుంబ సభ్యులు చెన్నై, పుదుచ్చేరి, కోయంబత్తూరులో తొమ్మిది రకాల ఆస్తులను కూడబెట్టారన్న సమాచారంతో ఐటీ శాఖ దాడులు చేసినట్లు తెలిసింది. శశికళ శిక్ష అనుభవిస్తున్న పరప్పన అగ్రహార జైలు అధికారులకు కూడా ఈ జప్తుకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు పంపారు.

 

జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ 2017 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 'ఆపరేషన్ క్లీన్ మనీ'లో భాగంగా చెన్నై, కోయంబత్తూర్, పుదుచ్చేరితో పాటు 37 ప్రాంతాల్లో శశికళ ఆస్తులపై రెండేళ్ల క్రితం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. శశికళ ఇంట్లో పని చేసే సిబ్బంది పేర్లపై, కారు డ్రైవర్లు, అసిస్టెంట్ల పేర్లపై బినామీ ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు తేల్చారు. తాజాగా జప్తు చేసిన ఆస్తుల్లో పెరంబూర్‌లోని ఓ మాల్, ఓ రిసార్ట్, కోయంబత్తూర్‌లో ఉన్న ఓ పేపర్ మిల్, చెన్నైలో గంగ ఫౌండేషన్ పేరుతో ఉన్న స్పెక్ట్రమ్ మాల్, పుదుచ్చేరిలో శ్రీలక్ష్మి జువెలరీ పేరుతో ఉన్న ఓ రిసార్ట్‌ ఉన్నట్లు తెలిసింది.