హైదరాబాద్ : కార్మికుల సమ్మె నేపధ్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)కు సోమవారం నాటికి రూ. 341 కోట్ల మేరకు ఆదాయాన్ని కోల్పోయింది. సమ్మె కారణంగా సంస్థకు రోజుకు రూ. 11 కోట్ల మేరకు రెవిన్యూను కోల్పోతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తోపాటు మరికొన్ని డిమాండ్లతో కార్మికులు అక్టోబరు 5 వ తేదీ నుంచి సమ్మె చేస్తున్న విషయం విదితమే.
ఇక... సాధారణ రోజుల్లో ఒకవేళ బస్సులన్నీ నడిచి ఇంత రెవిన్యూ వచ్చినా కూడా ఆర్టీసీకి రోజు రూ. రెండు కోట్ల మేరకు నష్టం వస్తోన్న పరిస్థితి ఉంది. ఇక దసరా పండుగ సందర్భంగా వచ్చే అదనపు ఆదాయాన్ని కూడా సమ్మె నేపధ్యంలో... ఆర్టీసీ కోల్పోయింది. ఇదిలా ఉంటే... సమ్మె ముగిసిందనుకుంటే కూడా... ఇన్ని రోజుల సమ్మె తర్వాత సంస్థ వెంటనే కోలుకునే పరిస్థితి ఉండదు. సుదీర్ఘమైన సమ్మె కారణంగా ఇప్పటివరకు బస్సులన్నీ కూడా మూలన పడి ఉన్న విషయం తెలిసిందే.
ఒకవేళ సమ్మె ముగిసిపోయినా... ఇప్పటికిప్పుడు ఈ బస్సులు మళ్ళీ కండీషన్‌లోకి రావాలంటే కొంత సమయం పడుతుంది. ఇదంతా కూడా ఆర్టీసీకి భారంగానే మిగిలిపోనుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం జరుగుతున్న కార్మికుల సమ్మె తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ చరిత్రలోనే... అత్యంత సుదీర్ఘమైన సమ్మెగా మిగిలిపోనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు 27 రోజుల పాటు సమ్మె చేశారు. అప్పట్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ ప్రభుత్యోద్యోగులు నిర్వహించిన 'సకలజనుల సమ్మె'లో భాగంగా ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొన్నారు.
ఇక అంతకుముందు 2001 లో వేతన స్థిరీకరణను కోరుతూ ఆర్టీసీ కార్మికులు 24 రోజులపాటు సమ్మె నిర్వహించారు.
ఇదిలా ఉంటే సమ్మె నేపధ్యంలో ఆర్టీసీ కార్మికులకు అక్టోబరు నెల వేతనాలు అందలేదు. ఈ క్రమంలో వారి ఆర్ధిక బాధలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. మరోవైపు సంస్థ సైతం వేతనాలను చెల్లించే పరిస్థితిలో లేదని అధికారులు చెబుతున్నారు.
అక్టోబరు నెల మొత్తం కార్మికులు సమ్మెలో ఉండడంతో బస్సులు తిరగక రెవిన్యూ రాకపోవడమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. సమ్మె నేపధ్యంలో ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడిపించినా కూడా సంస్థకు పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. రెవిన్యూలో గణనీయమైన లోటు కనిపించింది.
ఇక... సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ విషయంలో ఇటు కార్మికులు మరింత పట్టుకు పోతుండగా, అటు ప్రభుత్వం సైతం అదే స్థాయిలో ససేమిరా అంటోంది. ఈ క్రమంలో... సమ్మె ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు వేల సంఖ్యలో రూట్లను ప్రైవేటుపరం చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
దీంతో రానున్న రోజుల్లో ఎలాంటి విపరిణామాలు సంభవిస్తాయోనన్న ఆందోళన కార్మికుల్లో నెలకొంది. మొత్తంమీద ఆర్టీసీ మరిన్ని నష్టాలను, మరింత ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడనుందన్నది నిర్వివాదాంశమన్న అభిప్రాయాలు తారస్థాయిలో వినవస్తున్నాయి.