బీజేపీ ఎంపీకి జరిమానా



న్యూఢిల్లీ: కాలుష్య నివారణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం ఢిల్లీ సర్కార్ ఇవాల్టి నుంచి మళ్లీ ప్రారంభించిన 'సరి-బేసి' పథకానికి వ్యతిరేకంగా కారు బయటకు తీసుకువచ్చిన బీజేపీ ఎంపీ విజయ్ గోయల్‌కు జరిమానా పడింది. నిబంధనలు ఉల్లంఘించి 'బేసి' నెంబరున్న కారును రోడ్డుపైకి తెచ్చినందుకు పోలీసులు ఈ జరిమానా వేశారు. దీనికి ముందు తన ఇంటి నుంచి కారును ఆయన బయటకు తీస్తూ, 'సరి-బేసి' స్కీమ్ పథకం ఓ 'తమాషా' అని కొట్టిపారేశారు. పంట వ్యర్థాలు తగులబెట్టడం వల్లే కాలుష్యమని ఢిల్లీ సర్కార్ చెబుతోందని, అలాంటప్పుడు ఈ సరి-బేసి పథకం వల్ల ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నింబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా వేస్తే చెల్లించేందుకు తాను సిద్ధమేనని ఆయన అన్నారు.

 

15 లక్షల కార్లే రోడ్లపైకి...

కాగా, ప్రతిరోజూ 30 లక్షల కార్లు రోడ్లపైకి వచ్చేవని, సరి-బేసి పథకం అమల్లోకి రావడంతో 15 లక్షల కార్లే రోడ్డుపైకి రావడం సంతోషంగా ఉందని, తప్పనిసరిగా కాలుష్య స్థాయి తగ్గుముఖం పడుతుందని ఆశిస్తున్నానని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.