ముంబై: మిత్రపక్షమైన శివసేన చెబుతున్న 50-50 ఫార్ములా, చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి పంచుకోవాలన్న డిమాండ్‌కు మరోసారి సీఎం పదవిని ఆశిస్తున్న దేవేంద్ర ఫడ్నవిస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మహారాష్ట్రలో త్వరలోనే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ప్రతిభ ఆధారంగానే పదవుల కేటాయింపు ఉంటుందని ఆయన మంగళవారంనాడు స్పష్టం చేశారు.
బీజేపికి అనుకూలంగానే ప్రజా తీర్పు వచ్చిందని, అందుకు అనుగుణంగా త్వరలోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. ఐదేళ్ల పాటు సమర్ధవంతమైన పాలనను బీజేపీ మాత్రమే అందించగలదని చెప్పారు. శివసేన 'సామ్నా' సంపాదకీయాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 50-50 ఫార్ములాపై చర్చ లేదని, కేవలం ప్రతిభ ఆధారంగా పదవుల కేటాయింపులు ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి వంటి కీలక పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకునే విషయంపై కూడా చర్చ ఉండదని ఆయన సమధానమిచ్చారు. డిమాండ్ల విషయమై శివసేన నుంచి ప్రస్తుతానికైతే తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని, ఒకవేళ వస్తే వాటి ప్రాధాన్యతను బట్టి పరిశీలిస్తామని చెప్పారు. 'మరోసారి నేను సీఎం పగ్గాలు చేపట్టడం ఖాయం' అని ఫడ్నవిస్ కుండబద్ధలు కొట్టారు.