న్యూఢిల్లీ: రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మధ్య ప్రస్తుతం తీవ్రమైన పోటీ నడుస్తోంది. జియో ఇటీవల ఐయూసీ కాలింగ్ నిమిషాలతో మూడు కొత్త ఆల్ ఇన్ వన్ ప్యాక్‌లు.. రూ.222, రూ.333, రూ.444లను విడుదల చేసింది. దీంతో జియోను ఎదుర్కొనేందుకు వొడాఫోన్ ఐడియా రంగంలోకి దిగింది. రూ.229తో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్యాక్ ద్వారా వినియోగదారులకు గరిష్ట ప్రయోజనాలను అందించాలని, తద్వారా పడిపోతున్న యూజర్ బేస్‌ను కాపాడుకోవాలని భావిస్తోంది. ఎయిర్‌టెల్ ఇటీవల తీసుకొచ్చినట్టు రూ.169 ప్రీపెయిడ్ ప్లాన్‌ను విడుదల చేసిన వొడాఫోన్ తాజాగా 28 రోజుల చెల్లుబాటుతో ఈ కొత్త ప్లాన్‌ను విడుదల చేసింది.
రిలయన్స్ జియో రూ.222 ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ప్లాన్ కాలపరిమితి 28 రోజులు. ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేసేందుకు 1,000 నిమిషాలు లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఉన్నాయి. జియో కంటే ఏడు రూపాయలు ఎక్కువే అయినా వొడాఫోన్ ప్లాన్‌లో వినియోగదారులు ఏ నెట్‌వర్క్‌కు అయినా దేశవ్యాప్తంగా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 2జీబీ డేటా 28 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితంగా పంపుకోవచ్చు. ఇవి కాకుండా వొడాఫోన్ ప్లే యాప్ ద్వారా ఉచితంగా లైవ్ టీవీ, సినిమాలు కూడా చూడవచ్చు. కాగా, వొడాఫోన్ గతంలో ప్రవేశపెట్టిన రూ.255 ప్లాన్‌ను తాజాగా రద్దు చేసింది. రూ.229 ప్లాన్ దీనికి దగ్గరగా ఉండడమే ఇందుకు కారణం. మరోవైపు, జియోకు పోటీగా వొడాఫోన్ రూ.229 ప్లాన్ ప్రకటించగా, ఎయిర్‌టెల్ మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ప్లాన్‌ను ప్రటించలేదు.