ప్రజాసాక్షి
PRAJASAKSHI TELUGU DAILY
చంద్రయాన్-2 ప్రయోగం 95 శాతం సక్సెస్: ఇస్రో
చెన్నై: సరిగా జాబిల్లిపై కాలుమోపే కొద్ది క్షణాల ముందు విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ కట్ అయినప్పటికీ... విఫలం' అనే మాటకు చంద్రయాన్-2 చాలా దూరంలో నిలిచిందని ఇస్రో శాస్త్రవేత్త ఒకరు వెల్లడించారు. ఇది ఎదురుదెబ్బే తప్ప విఫలమైనట్టు కాదని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్లో భాగమైన చంద్రయాన్-2 ఆర్బిటర్ ఇప్పటికీ చంద్రుడి చుటూ తిరుగుతోందనీ.. ఒక ఏడాది పాటు తన వరిశోధనలు కొనసాగిస్తుందని తెలిపారు. “ఈ ప్రయోగంలో కేవలం 5 శాతం.. అంటే విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్లతో మాత్రమే సంబంధాలు తెగిపోయాయి. మిగతా 95 శాతం.. అంటే చంద్రయాన్-2 ఆర్బిటర్ ప్రస్తుతం చంద్రుడి చుట్టూ విజయవంతంగా తిరుగుతోంది...” అని ఇస్రో శాస్త్రవేత్త వెల్లడించారు. చంద్రుడి ఫోటోలతో పాటు, సాధ్యమైతే విక్రమ్ ల్యాండర్ ఫోటోలను కూడా ఆర్బిటర్ తీసి ఇసోకి పంపిస్తుందని ఆయన తెలిపారు. వీటిని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తారన్నారు.
ల్యాండర్లోని రోవర్ ప్రగ్యాన్ జీవిత కాలం కేవలం 14 రోజులు మాత్రమే నన్న సంగతి తెలిసిందే. కాగా ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి దశలో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలుమోపే కొద్ది క్షణాల ముందు ఇస్రోతో సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే. చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఈ సమస్య చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన శాస్త్రవేత్తలు ప్రస్తుతం డేటాను విశ్లేషిస్తున్నట్టు ప్రకటించారు.