* ఉగ్రవాదంపై పోరాటానికి ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపై రావాలి
*మానవత్వానికి ఉగ్రవాదం పెనుముప్పు
* ప్రపంచ వ్యాప్తంగా శాంతి,సామరస్యం వెల్లివిరియాలి:మోదీ
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా శాంతి, సామరస్యం వెల్లివిరియాలని భారత్ కోరుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మానవత్వానికి ఉగ్రవాదం పెనుముప్పు అని, ఉగ్రవాదం అనేది కేవలం ఏదో ఒక దేశానికే పరిమితం కాదని, ప్రపంచ దేశాలకూ, మానవాళికి ృద్ధికి ముప్పు అని అన్నారు. ఉగ్రవాదంపై పోరాటానికి, దాని పీచమణిచేందుకు ప్రపంచ దేశాలన్నీ ఏకతాటి పై రావాలని పిలుపునిచ్చారు.
శుక్రవారం 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మోదీ ప్రసంగిస్తూ, ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం (భారత్) తన ప్రభుత్వానికి, తనకు పట్టం కట్టిందని, మరోసారి పెద్ద మెజారిటీతో అధికారంలోకి వచ్చామని, ప్రజాతీర్పు వల్లే తాను ఇవాళ ఇక్కడ ఉన్నానని అన్నారు. తాను ఇక్కడకు వచ్చేటప్పడు ఐక్యరాజ్యసమితి గోడలపై 'నో మోర్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్' అనే నినాదం చదివానని చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి విముక్తి చేసేందుకు భారతదేశంలో చాలా పెద్ద ప్రచారం నడుపుతున్నామనే విషయాన్ని చెప్పడానికి తాను గర్విస్తున్నానని అన్నారు.
అభివృద్ధి చెందుతున్న దేశంగా అతి పెద్ద పరిశుభ్రతా డ్రైవ్ ను తాము విజయవంతంగా చేపట్టామని, ఐదేళ్లలో 11 కోట్ల టాయిలెట్లు నిర్మించామని, ఇది ప్రపంచానికి స్ఫూర్తి సందేశమవుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఆరోగ్య రంగంలోనూ భారత్ ఎన్నో విజయాలు సాధించిందని, టీబీ నిర్మూలనకు కట్టుబడి ఉందని అన్నారు.
ప్రధాని మోదీ తన ప్రసంగంలో మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద ప్రస్తావన కూడా చేశారు.
ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాలు జరుగనున్నాయని, మహాత్మాగాంధీ చాటి చెప్పిన శాంతి, అహింసా సిద్ధాంతాలు ఇవాళ ప్రపంచ శాంతి, ప్రగతి, అభివ ృద్ధికి అత్యంత ఆవశ్యకాలని అన్నారు. మోదీ ప్రసంగిస్తుండగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం వద్ద ప్రవాస భారతీయులు పెద్ద ఎతున సంబరాలు చేసుకున్నారు.