త్రిసభ్య కమిటీ విచారణకు ఇక హాజరు కాబోనన్న ఫిర్యాదుదారు

సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ లైంగిక వేధింపుల కేసు: త్రిసభ్య కమిటీ విచారణకు ఇక హాజరు కాబోనన్న ఫిర్యాదుదారు



సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ.. తన ఫిర్యాదుపై త్రిసభ్య కమిటీ జరుపుతున్న విచారణకు ఇకపై హాజరుకాబోనని ప్రకటించారు.


కమిటీ వ్యవహరిస్తున్న తీరుపై ఆమె పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.


తాను వినికిడి సమస్య, భయాందోళనలతో బాధపడుతున్నానని.. విచారణ సమయంలో న్యాయవాది కానీ, సహాయకులు కానీ వెంట ఉండేందుకు అనుమతించాలని కోరినా కమిటీ తిరస్కరించిందని ఆమె చెప్పారు.


తాను ఎంతగా సమస్యను ఎదుర్కొంటున్నది పదేపదే వివరించినా కమిటీ పట్టించుకోలేదని తెలిపారు. ముగ్గురు సుప్రీం న్యాయమూర్తులను ఒంటరిగా ఎదుర్కోవడం ఎంతో భయానకంగా ఉందని ఆమె అన్నారు.


విచారణ జరిగిన తొలి రోజు తన కారును ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిళ్లపై వెంబడించారని ఆరోపించారు.


అత్యాచారం కేసులో ఆశారాం బాపు కుమారుడికి యావజ్జీవ శిక్ష


ఐదేళ్ల తర్వాత వీడియోలో కనిపించిన ఇస్లామిక్ స్టేట్ అధినేత.. శ్రీలంక దాడులు తమ పనేనని ప్రకటన



సిట్టింగ్ సీజేఐపై వచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదును ప్రత్యేకంగా పరిగణించాలన్న వాస్తవాన్ని గుర్తించేందుకు కమిటీ సిద్ధంగా లేదని, తాను ఎదుర్కొంటున్న అసమాన పరిస్థితుల దృష్ట్యా పారదర్శకత, సమానత్వం ఉండే విచారణ ప్రక్రియను కమిటీ పాటించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.


విచారణ ప్రక్రియ వీడియో, ఆడియో రికార్డింగ్ చేయడం లేదని, తన వాంగ్మూలం ప్రతులు కూడా తనకు ఇవ్వలేదని ఆమె చెప్పారు.


గొగోయ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తర్వాత తనను, తన భర్తను, ఇతర కుటుంబ సభ్యులను బాధితులుగా మార్చారని సదరు మహిళ ఇటీవల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.


ఈ విషయంపై మొత్తం 22 మంది సుప్రీం కోర్టు జడ్జిలకు ఏప్రిల్ 19న ఆమె లేఖ రాశారు.


అప్పట్లో గొగోయ్‌కు ఆమె జూనియర్ అసిస్టెంట్‌గా ఉన్నారు.


ఆమె చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే అధ్యక్షతన త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది. జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఇందూ మల్హోత్రా దీనిలో సభ్యులుగా ఉన్నారు.


అనధికారిక విచారణ


తాము అనధికారిక విచారణ జరుపుతున్నామని త్రిసభ్య కమిటీ తనతో వ్యాఖ్యానించినట్లు ఫిర్యాదు చేసిన మహిళ వెల్లడించారు.


''ఇన్-హౌజ్ కమిటీ ప్రక్రియను గానీ, విశాఖ మార్గదర్శకాలను గానీ ఆ కమిటీ పాటించట్లేదు. విచారణ ప్రక్రియ గురించి మీడియాకు చెప్పొద్దని మౌఖికంగా నాకు సూచించారు. నా న్యాయవాదికీ చెప్పొద్దన్నారు. ఆలస్యంగా ఎందుకు ఫిర్యాదు చేశావంటూ కమిటీ పదే పదే నన్ను ప్రశ్నించింది'' అని ఆమె తెలిపారు.


ఫిర్యాదుపై సీజేఐ స్పందన కమిటీ కోరిందా అన్న విషయాన్ని కూడా తనకు వెల్లడించలేదని ఆమె అన్నారు.


పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం కింద అధికారిక విచారణగా దీన్ని పరిగణించాలని కమిటీలోని న్యాయమూర్తులకు లేఖ రాశానని పేర్కొన్నారు.


సీజేఐకి జూనియర్లైన జడ్జిలతో ఈ కమిటీ వేసినా, న్యాయమూర్తులపై విశ్వాసం ఉంచి విచారణలో పాల్గొనేందుకు సిద్ధమయ్యానని ఆమె అన్నారు.


నిస్సహాయ పరిస్థితులు, ఒత్తిడి నడుమ తాను విచారణ ప్రక్రియల్లో పాల్గొనలేనని వివరించారు.