బీజేపీలో చేరనున్న ... విజయశాంతి!?

*కాంగ్రెస్ నేతలతో నెగలలేనని రాములమ్మ భావన


*తన మాటకు విలువ ఇవ్వడం లేదని ఆమె ఆవేదన


*దసరానాడు బీజేపీలో చేరేందుకు నిర్ణయం


*గత కొన్నాళ్లుగా బీజేపీ నేతలతో చర్చలు



హైదరాబాద్: కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి పార్టీ మార్పు విషయంలో 'గతంలో చెప్పిన మాట నిజమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి!. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, టీపీసీసీసీ చైర్ పర్సన్ విజయశాంతి అలియాస్ రాములమ్మ త్వరలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ, ఢిల్లీకి చెందిన కమలనాథులు రాములమ్మతో భేటీ అయ్యి.. పార్టీలో చేరికపై చర్చించారని సమాచారం. ఇందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన ఆమె.. దసరా రోజున ఢిల్లీ వేదికగా కాషాయ కండువా కప్పుకోవాలని ఫిక్స్ అయినట్లు సమాచారం.


ఒకప్పటి తమ పార్టీ నేత కావడం, స్టార్ డమ్ ఉన్న నేత కావడంతో ఆమెను పార్టీలో చేర్చుకోవడానికి బీజేపీ ఎప్పట్నుంచో విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. రానున్న హుజూర్ నగర్ ఉపఎన్నికల్లోనూ, అలాగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె సేవలు వినియోగించుకోవాలనే భావనలో బీజేపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ కు ధీటుగా వెళ్లాలంటే బీజేపీతోనే సాధ్యమన్న భావనలో విజయశాంతి ఉన్నారని సమచారం. బీజేపీలో చేరికపై త్వరలోనే ఓ నిర్ణయానికి రానున్నట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. బీజేపీలో చేరికకు ఆమె సిద్ధంగానే ఉన్నారని తెలుస్తోంది. తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవడానికి బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. పలు నియోజకవర్గాల్లో తమకు పట్టులేని నేపథ్యంలో టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి నాయకులను చేర్చుకునేందుకు సాక్షాత్తూ పార్టీ జాతీయ నాయకత్వం పర్యవేక్షణలో సంప్రదింపుల పర్వం కొనసాగుతోంది. బీజేపీ జాతీయ, రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలు స్వయంగా ఆయా పార్టీలకు చెందిన ప్రముఖులతో అంతర్గత చర్చలు కొనసాగిస్తున్నారు.