మోదీకి గేట్స్ ఫౌండేషన్ ‘గ్లోబల్ గోల్‌కీపర్’ అవార్డు.. దీనిపై వివాదం ఏమిటి? ఎందుకు?

మోదీకి గేట్స్ ఫౌండేషన్ 'గ్లోబల్ గోల్‌కీపర్' అవార్డు.. దీనిపై వివాదం ఏమిటి? ఎందుకు?



భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి గేట్స్ ఫౌండేషన్ 'గ్లోబల్ గోల్ కీపర్' అవార్డు బహూకరించింది. సురక్షిత పారిశుధ్యం అందించటంలో ఆయన నాయకత్వంలో భారత్ సాధించిన పురోగతిని గుర్తిస్తూ ఈ అవార్డును బహూకరించినట్లు గేట్స్ ఫౌండేషన్ పేర్కొంది. అయితే.. మోదీకి ఈ అవార్డును ఇవ్వటం వివాదాస్పదంగా మారింది. 


 


నిజానికి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ స్థాపించిన బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్.. భారత ప్రధాని నరేంద్రమోదీని గ్లోబల్ గోల్ కీపర్ అవార్డుకు ఎంపిక చేసినట్లు కేంద్రమంత్రి జితేంద్రదాస్ సెప్టెంబర్ 2వ తేదీనే ఒక ట్వీట్ ద్వారా ప్రకటించారు.


బహిరంగ మల విసర్జనను నిర్మూలించటానికి మోదీ ప్రభుత్వం చేసిన కృషిని గుర్తిస్తూ ఆయనకు ఈ అవార్డును ప్రకటించినట్లు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా పేద ప్రజలందరికీ లక్షలాది టాయిలెట్లను నిర్మించటం ద్వారా పారిశుధ్యాన్ని మెరుగుపరచటం లక్ష్యంగా మోదీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పథకం అమలు చేస్తోంది. 


అయితే.. ఈ పథకం అమలును ప్రశంసిస్తూ నరేంద్ర మోదీకి గ్లోబల్ గోల్ కీపర్ అవార్డును అందించటం పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. ముగ్గురు నోబెల్ బహుమతి విజేతలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గేట్స్ దంపతులకు లేఖ రాశారు. మోదీకి ఈ అవార్డు ఇవ్వవద్దంటూ లక్ష మందికి పైగా జనం ఒక పిటిషన్ పెట్టారు.


న్యూయార్క్‌లో మంగళవారం జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరు కావలసిన పలువురు సెలబ్రిటీలు - ముఖ్యంగా బ్రిటిష్ ఏషియన్ నటులు జమీలా జమీల్, రిజ్ అహ్మద్‌లు వైదొలగారు. కానీ కారణం చెప్పలేదు.


ఇప్పటివరకూ గేట్స్ ఫౌండేషన్ 'గోల్‌కీపర్' అవార్డు అందుకున్న వారందరూ.. క్షేత్ర స్థాయిలో పనిచేసే రాజకీయ, సామాజిక ఉద్యమకారులే కాగా.. ఇప్పుడు భారత ప్రధానమంత్రిని ఈ అవార్డుకు ఎంపిక చేయటం పట్ల ప్రధానంగా విస్మయం వ్యక్తమవుతోంది.


 


మోదీకి ఈ అవార్డు ఎందుకు ఇస్తున్నారు?


భారతదేశంలో కోట్లాది మంది ప్రజలకు మరుగుదొడ్లు, నీటి సరఫరా అందుబాటులో లేవు. వీరు ఏళ్లుగా బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేస్తున్నారు. ఇదో నిరంతర సమస్య. మట్టి, నీరు కాలుష్యం కావటంతో పాటు.. రాత్రుళ్లు ఒంటరిగా బహిర్భూమికి వెళ్లే బాలికలు, మహిళలు ప్రమాదంలో కూడా పడుతున్నారు.


ఈ బహిరంగ మలవిసర్జన సమస్యను తుదముట్టిస్తామని నరేంద్ర మోదీ 2014లో ప్రకటించటం.. భారత ప్రజలతో పాటు ప్రపంచ దృష్టినీ ఆకర్షించింది. మోదీ ఎంతో ఇష్టపడే పథకం అని చెప్పదగ్గ 'స్వచ్ఛ భారత్' కేంద్ర బిందువు ఈ అంశమే.


స్వచ్ఛ భారత్ పథకం అద్భుత విజయం సాధించిందని నరేంద్రమోదీతో పాటు అధికార భారతీయ జనతా పార్టీ ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రకటించింది.


దేశంలో తాను అధికారంలోకి వచ్చేటప్పటికి కేవలం 40 శాతం మందికే మరుగుదొడ్లు అందుబాటులో ఉంటే.. ఈ పథకం వల్ల ఇప్పుడు 90 శాతం మంది ప్రజలకు మరుగుదొడ్లు ఉన్నాయని మోదీ చెప్పుకొచ్చారు.


''ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించే కృషిలో భాగంగా పారిశుధ్యం పెంపొందించటంలో భారతదేశం సాధిస్తున్న పురోగతి''కి మోదీని గౌరవిస్తూ ఈ అవార్డును అందిస్తున్నామని బిల్ అండ్ మిలిందా గేట్స్ బీబీసీకి పంపిన ఒక ప్రకటనలో వివరించింది.



ఆ పథకం ఎంత విజయం సాధించింది?


ఈ పథకం విజయాన్ని ఎలా లెక్కగడతారనే దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది.


దేశంలో మరుగుదొడ్ల సంఖ్య గణనీయంగా పెరగాయన్నది నిజమే అయినా.. వాటిలో చాలా వరకూ పనిచేయటం లేదని, లేదంటే వివిధ కారణాల వల్ల ఉపయోగించటం లేదని బీబీసీ పరిశోధనలో వెల్లడైంది.


నీటి సరఫరా లేకపోవటం మొదలుకుని.. నిర్వహణా లోపాలు.. లోతుగా నాటుకుపోయిన సాంస్కృతిక అలవాట్ల వరకూ అనేక కారణాలు ఇందులో ఉన్నాయి.


ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జనకే మొగ్గుచూపుతున్నట్లు ఇటీవల నిర్వహించిన ఒక పరిశోధనలో గుర్తించారు. దీనికి కారణం.. అలా చేయటం మరింత సౌకర్యవంతంగా ఉండటమే కాదు.. సంపూర్ణ, ఆరోగ్యవంతమైన, విలువైన జీవితంలో అది భాగమని వారు భావించటం కూడా.


మరో ప్రధాన సమస్య ఏమిటంటే.. పేద ప్రజలు తమ ఇంటిలో మరుగుదొడ్డి నిర్మించుకోవటానికి ప్రభుత్వం రాయితీలు అందిస్తుంది. కానీ.. ఈ రాయితీలను వాయిదాల పద్ధతిలో చెల్లించటానికి ఏడాది కాలం పైగా పడుతుంది. దీనివల్ల చాలా మంది పేదలు తమ ఇంట్లో మరుగుదొడ్డి కట్టుకోవటానికి నెలల తరబడి వేచివుండాల్సి వస్తోంది.




  ''చాలా మంది లబ్ధిదారులు నిర్మాణం ప్రారంభించారు కానీ పూర్తిచేయలేదు'' అని తెలిపారు మహిళా హౌసింగ్ సేవా ట్రస్ట్‌కు చెందిన సిరాజ్ హిరానీ. ఈ స్వచ్ఛంద సంస్థ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచటం కోసం పనిచేస్తోంది. స్వచ్ఛ భారత్ పథకంతో సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పనిచేశారాయన.

''అంతేకాదు.. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలో మురుగు కాలువ నిర్మాణానికి చోటు లేదు. అంటే.. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది మరుగుదొడ్డి కట్టుకోవాలంటే సెప్టిక్ ట్యాంక్ కూడా తవ్వించి కట్టుకోవాలి'' అని హిరానీ పేర్కొన్నారు. దీనివల్ల.. భూగర్భ జలాలు ఎక్కువ మట్టంలో ఉండే తీర ప్రాంతాల్లో భూగర్భ జలాలు, మట్టి కలుషితమవుతాయని ఆయన చెప్తున్నారు.


''బహిరంగ మలవిసర్జన గణనీయంగా తగ్గింది నిజమే.. కానీ దీనిని స్థిరంగా కొనసాగించటం ఎలా అనేదే అతి పెద్ద సమస్య'' అని వ్యాఖ్యానించారు.


ఈ పథకం విజయాన్ని లెక్కగట్టటానికి ప్రభుత్వ గణాంకాలు.. మరుగుదొడ్డి వంటి మౌలిక వసతులు ఉన్నాయా లేదా అన్నదాని మీదే ఆధారపడ్డాయి కానీ.. వాటిని వాస్తవంగా వినియోగిస్తున్నారా? అలవాట్లలో తేడా వచ్చిందా? అనే అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు.


 


విమర్శకులు ఏమంటున్నారు?


స్వచ్ఛ భారత్ పథకంలో లోటుపాట్లను విమర్శకులు ఎత్తిచూపుతూనే ఉన్నా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీదే తీవ్ర విమర్శలున్నాయి.


మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో 2002లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జరిగిన మత హింసలో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ విషయంలో ఆయన అమెరికాలో అడుగుపెట్టరాదంటూ ఆ దేశం ఏళ్ల తరబడి నిషేధించింది కూడా.


భారతదేశ రాజకీయాల్లో ఎంతో మంది ఆరాధించే మోదీని మతపరమైన చీలికను, మైనారిటీల పట్ల హింసను ప్రోత్సహించే నాయకుడిగా చాలా మంది విమర్శకులు పరిగణిస్తారు. తాజాగా భారత ఆధీనంలోని కశ్మీర్‌లో ఆగస్టు 5వ తేదీ నుంచి కొనసాగుతున్న భద్రతా దిగ్బంధనాన్ని.. ఆ రాష్ట్రానికి భారత రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తి హోదాను తొలగించటాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.



వేలాది మంది రాజకీయ నాయకులు, ఉద్యమకారులు, వ్యాపారవేత్తలు, నిరసనకారులను నిర్బంధించారు. సమాచార సంబంధాలు చాలా వరకూ కత్తిరించివేశారు. భద్రతా బలగాలు బలప్రయోగానికి పాల్పడుతున్నాయని, మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపణలూ వస్తున్నాయి.


''ఈ అవార్డు ఇచ్చిన సమయం - కశ్మీరీలు మాత్రమే కాదు.. కశ్మీర్ అంశం - చాలా బాధపెడుతోంది'' అని బీబీసీతో చెప్పారు సామాజిక, రాజకీయ వ్యాఖ్యాత శివ్ విశ్వనాథన్.


''కశ్మీర్‌లో ట్రామా క్లినిక్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం చాలా ఉంది. గేట్స్ ఫౌండేషన్ హక్కుల పేరుతో వీటిని నెలకొల్పగలదా? మోదీ ప్రభుత్వం అందుకు అనుమతిస్తుందా?'' అని ఆయన ప్రశ్నించారు.


బిల్ గేట్స్ వంటి ఉదార స్వచ్ఛంద సేవకులు మోదీ ప్రభుత్వానికి సమ్మతిని మద్దతును అందిస్తున్నారన్న విషయాన్ని విస్మరించటం కూడా కష్టమన్నారు. ''ఇందులో అమాయకత్వం ఎందుకు? భారతదేశంలో గేట్స్ ఫౌండేషన్ సాఫీగా సాగటానికి ఇది తోడ్పడుతుంది'' అని విశ్వనాథన్ వ్యాఖ్యానించారు. 


 


గేట్స్ ఫౌండేషన్ ఏమంటోంది?


భారత ప్రధాని నరేంద్రమోదీ 2019 గ్లోబల్ గోల్‌కీపర్ అవార్డు అందుకుంటారని బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్.. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగిన మంగళవారం వరకూ అధికారికంగా ప్రకటించలేదు. అవార్డుల ప్రదానోత్సవంలో అవార్డు విజేతల పేర్లను ప్రకటిస్తామని ఆ వెబ్‌సైట్‌లో చెప్తూ వచ్చింది.


అయితే.. దానికి ముందే మోదీ ఈ అవార్డుకు ఎంపికైనట్లు భారత కేంద్ర మంత్రి వెల్లడించటం.. దాని మీద విమర్శలు వెల్లువెత్తటంతో.. మోదీని నిజంగానే ఎంపిక చేసినట్లు అంగీకరించింది.


ఈ అవార్డును అందుకున్న తొలి రాజకీయ నాయకుడు నరేంద్రమోదీ కాదు. లైబీరియా మాజీ అధ్యక్షుడు ఎలెన్ జాన్సన్ సిర్లీఫ్‌ను 2017లో ఈ అవార్డుతో సత్కరించారు.


ఇప్పుడు మోదీని ఈ అవార్డుకు ఎంపిక చేయటాన్ని గేట్స్ ఫౌండేషన్ సమర్థించుకుంటూ.. ''పారిశుద్ధ్యం అంశం మీద ఇంతకుముందు గణనీయమైన దృష్టి పెట్టలేదు. దీని గురించి మాట్లాడటానికి చాలా ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. దీనికి సులువైన పరిష్కారాలు లేకపోవటం ఒక కారణం'' అని బీబీసీకి పంపిన ప్రకటనలో పేర్కొంది.



''స్వచ్ఛ భారత్ పథకానికి ముందు భారతదేశంలో 50 కోట్ల మందికి పైగా ప్రజలకు సురక్షిత పారిశుధ్యం అందుబాటులో లేదు. ఇప్పుడు మెజారిటీ ప్రజలకు అది అందుబాటులో ఉంది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కానీ.. భారతదేశంలో పారిశుద్ధ్యం అందుబాటులో ఉండటం వల్ల ప్రభావాలు ఇప్పటికే సాకారమవుతున్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్ ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలకు ఒక నామూనాగా నిలవగలదు'' అని చెప్పింది.