ఐరాస సర్వసభ్య సమావేశం (యూఎన్‌జీఏ) లో శుక్రవారం భారత్, పాకిస్తాన్ దేశాల ప్రధానులిద్దరూ ప్రసంగించారు.
ప్రపంచానికి తమ దేశం యుద్ధాన్ని కాకుండా, జ్ఞానాన్ని పంచిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అంటే.. భారత్‌తో యుద్ధం వస్తే, మరణం వరకూ పోరాడతామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు చేశారు. దాని పర్యవసానాలు అంతర్జాతీయ సమాజం కూడా చవిచూడాల్సి వస్తుందని ఇమ్రాన్ హెచ్చరించారు.
యూఎన్‌జీఏలో శుక్రవారం తొలుత మోదీ ప్రసంగించారు.
ఉగ్రవాదంతో ప్రపంచమంతటికీ ముప్పే
కేవలం 17 నిమిషాలే ప్రసంగించినా, మోదీ చాలా అంశాల గురించి మాట్లాడారు.
పాకిస్తాన్ పేరు ప్రస్తావించకుండానే, పరోక్షంగా ఆ దేశంపై విమర్శలు చేశారు.
''ఉగ్రవాదంతో ఏ ఒక్క దేశానికో కాదు, ప్రపంచమంతటికీ పెను ముప్పే. మానవజాతి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో అది కూడా ఒకటి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఒక్కటవ్వాల్సిన ఆవశ్యకతను మేం వివరిస్తున్నాం'' అని అన్నారు.
130 కోట్ల మంది భారతీయుల తరఫున ఐరాస వేదికగా ప్రసంగం చేసే అవకాశం రావడం తన అదృష్టమని మోదీ చెప్పారు.
''అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు జరిగాయి. ప్రపంచంలోనే అత్యధిక ఓట్లతో మా ప్రభుత్వం ఎన్నికయ్యింది'' అని వ్యాఖ్యానించారు.
భారత్‌లో సాగుతున్న పురోగతి గురించి కూడా వివరించారు.
వచ్చే అక్టోబర్ 2న మహాత్మ గాంధీ 150వ జయంతిని జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ సందర్భానికి ఎంతో ప్రాధాన్యత ఉందని వ్యాఖ్యానించారు.
కశ్మీర్‌లో ఉండుంటే నేనూ తుపాకీ పట్టేవాణ్ని: ఇమ్రాన్ ఖాన్
యూఎన్‌జీఏలో మోదీ తర్వాత ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించారు.
ప్రస్తుత పరిస్థితులపై భారత్‌తోపాటు, అంతర్జాతీయ సమాజాన్ని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.
సుదీర్ఘంగా 50 నిమిషాల పాటు ఇమ్రాన్ ప్రసంగం సాగింది. ప్రధానంగా కశ్మీర్, ఇస్లామోఫోబియా అంశాల గురించి ఆయన మాట్లాడారు.
కశ్మీర్‌లో 80 లక్షల మందిని భారత ప్రభుత్వం నిర్బంధించిందని, ఆ దేశం అతిపెద్ద మార్కెట్ అన్న కారణంతో పాశ్చాత్య దేశాలు కిమ్మనకుండా ఉండటం సరికాదని విమర్శించారు.
''ఆగస్టు 5న కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి, అక్కడ ఉంటున్న 80 లక్షల మందిని భారత్ దిగ్బంధించింది. తొమ్మిది లక్షల మంది సైనికులను అక్కడ మోహరించింది. మహిళలు, చిన్నారులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారిని బంధించారు. ఒక వేళ జంతువులను అలా బంధించినా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో ఆందోళనలు వ్యక్తమయ్యేవి. రాబోయే రోజుల్లో కర్ఫ్యూ తొలగించిన తర్వాత అక్కడ రక్తపాతం తప్పదు. పుల్వామా లాంటి ఘటనలు మరిన్ని జరుగుతాయి. దానికి మళ్లీ భారత్ పాకిస్తాన్‌నే నిందిస్తుంది'' అని అన్నారు.
అణ్వాయుధ దేశాలైన భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం వస్తే దాని పర్యవసానాలు మిగతా ప్రపంచంపైనా ఉంటాయని హెచ్చరించారు.
''ఒక కశ్మీరీ స్థానంలో నేనుండి ఆలోచిస్తున్నా, ఒకవేళ ఆ పరిస్థితిలో నేనుంటే తుపాకీ పడతా'' అని వ్యాఖ్యానించారు.
''కశ్మీరీ ముస్లింల పరిస్థితిని ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది ముస్లింలు అలాగే చూస్తూ ఊరుకుంటారా? సినిమాల్లో న్యాయం జరగనందుకు, తుపాకీ పట్టుకుని అన్యాయం చేసినవారిని హీరో చంపేస్తుంటే హాల్‌లో చప్పట్లు కొడతారుగా'' అని అన్నారు.
''కీడు (యుద్ధం) జరగకూడదని ఆశించండి. కానీ, అందుకు సన్నద్ధంగా ఉండండి'' అని అంతర్జాతీయ సమాజాన్ని హెచ్చరించారు.
''ఇది హెచ్చరిక కాదు. మా ఆందోళన'' అని అన్నారు.
కశ్మీర్‌లో భారత్ విధించిన కర్ఫ్యూ ఎత్తివేసేలా ఐరాస చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.
''ఇది ఐరాస ముందున్న పరీక్ష. కశ్మీరీలకు స్వీయ నిర్ణయాధికారం ఉంటుందని మీరే హామీ ఇచ్చారు. దాన్ని వారికి ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంది'' అని అన్నారు.
ఆర్ఎస్ఎస్ జాత్యహంకార, విద్వేష సంస్థ అని ఇమ్రాన్ తీవ్రంగా మండిపడ్డారు.
''ఆర్ఎస్ఎస్ సంస్థలో మోదీ జీవితకాల సభ్యుడు. ఆ సంస్థ హిట్లర్, ముస్సోలినిల నుంచి స్ఫూర్తి పొందింది. ముస్లింలు, క్రైస్తవులను అణిచివేయడం వారి లక్ష్యం. వారి భావజాలం మహాత్మ గాంధీని కూడా బలి తీసుకుంది'' అని ఆరోపించారు.
ఐరాస పరిశీలకులను ఆహ్వానిస్తున్నా
''మా దేశంలో ఉగ్రవాద సంస్థలు నడుస్తున్నాయని భారత్ ఆరోపిస్తోంది. అయితే, అలాంటివేవి మిగిలినా నాశనం చేయాలని మేము నిర్ణయానికి వచ్చాం. ఐరాస పరిశీలకులు కూడా వచ్చి చూడొచ్చు. అంతకుముందు పాక్ ప్రభుత్వాలు ఇలాంటి చర్యకు ముందుకు రాకపోవచ్చు. మేం మాత్రం ఐరాస పరిశీలకులను ఆహ్వానిస్తున్నాం'' అని ఇమ్రాన్ అన్నారు.
తాను అధికారంలోకి రాగానే, భారత్‌తో స్నేహం కోసం ప్రయత్నించానని.. సానుకూల స్పందన మాత్రం రాలేదని చెప్పారు.
''ఎన్నికల కోసం వాళ్లలా చేస్తున్నారేమో అనుకున్నాం. కానీ, ఆ తర్వాత కూడా పాకిస్తాన్ ఆర్థికంగా దివాలా తీసేలా, మమ్మల్ని బ్లాక్ లిస్ట్‌లో చేర్పించేందుకు వారు ప్రయత్నించారు. బలూచిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించారు'' అని అన్నారు.
''పుల్వామా ఘటన జరిగినప్పుడు పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ ఆరోపించింది. ఆధారాలు ఇస్తే, చర్యలు తీసుకుంటామని చెప్పాం. వాళ్లు మాత్రం యుద్ధ విమానాలను పంపి, మాపై బాంబులు వేశారు. 350 మంది ఉగ్రవాదులను చంపామని చెప్పుకున్నారు. పది చెట్లు కూల్చారంతే. అది కూడా మాకు బాధాకరమే'' అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.
''మా దేశంలో దొరికిన భారత సైనిక పైలెట్‌ను తిరిగి శాంతిపూర్వక చర్యగా వారికి అప్పగించాం. కానీ, మోదీ ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా రాబోతోంది అంటూ ఎన్నికల ప్రచారం చేసుకున్నారు'' అని అన్నారు.
ఇమ్రాన్ మాట్లాడుతున్న సమయంలో సభలో ఉన్న భారత ప్రతినిధులు 'సిగ్గు.. సిగ్గు' (షేమ్.. షేమ్) అంటూ పలుమార్లు నినాదాలు చేశారు.